ఇంకా తాంత్రిక పూజలు ఇలాంటి చేతబడి కార్యక్రమాలు అక్కడక్కడా నమ్ముతున్న వారు చాలా మంది ఉన్నారు, ఇక విచక్షణ కోల్పోయి అనేక దారుణాలు చేస్తున్న వారు పోలీసులకు పట్టుబడుతున్నారు తాజగా ఇలాంటి దారుణం వెలుగులోకి వచ్చింది…హైదరాబాద్ అత్తాపూర్ సమీపంలో మూసీ నదిలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. మూసీ నది నీటిలో మృతదేహాలను గుర్తించిన స్థానికులు మంగళవారం మధ్యాహ్నం పోలీసులకు ఫోన్ చేశారు. లంగర్‌హౌజ్ పోలీసులు హుటాహుటిన వచ్చి నీటిలో పడిఉన్న మహిళల మృతదేహాలను వెలికితీశారు. అర్ధనగ్నంగా ఉన్న ఇద్దరి మహిళల తలలకు బలమైన గాయాలు ఉన్నాయి. క్లూస్‌టీమ్ సంఘటన స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. స్థానికులెవరూ మృతులను గుర్తించలేక పోయారు. వారి ఆనవాళ్లను చూసి రోజూకూలీలని భావిస్తున్నారు.
దీంతో ఈ రెండు గుర్తు తెలియని మృతదేహాలుగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.పిల్లర్ నెంబర్ 117 నుంచి జనప్రియ అపార్ట్‌మెంట్‌కు వెళ్లే రహదారి పక్కన మూసీ నది ఒడ్డున ఈ మృతదేహాలు స్థానికులకు కనిపించాయి. ఇద్దరి మెడకు ఒకే చీర చుట్టుకొని ఉంది. ఒక మహిళకు తల వెనుక భాగంలో, మరో మహిళ కు తల ఎడమ వైపున బలమైన గాయాలు ఉన్నాయి. ఇద్దరినీ బండరాయితో మోది హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఎక్కడైనా చంపి ఇక్కడ మృతదేహాలను పడేశారా? అనే కోణాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ఇద్దరు మహిళల వయస్సు ఒకరిది (40), మరొకరిది (50) సంవత్సరాలు ఉంటాయి. ఒకరి చేతికి పసుపు ఉండడం, చేతికి పసుపు కంకణం ఉండడం పలు అనుమానాలకు దారితీస్తోంది. వారిద్దరినీ బ్లూకలర్ చెక్స్ చీరలో చుట్టి ఉంచారు. ఇద్దరి కాళ్లకూ మెట్టెలు ఉన్నాయి. ఓ మహిళ మెడలో బంగారు గొలుసుతో పాటు పచ్చని గాజుల పెంకులూ కనిపించాయి. ఒడ్డున కొత్త చీర.. పూజా సామగ్రి దర్శనమివ్వడంతో నరబలి కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం రాత్రి పౌర్ణమి కావడంతో రాత్రి సమయంలో మూసీ నది ఒడ్డున పూజలు నిర్వహించి ఉంటారని భావిస్తున్నారు. వారి సంబంధీకులెవరైనా గుర్తించిన తర్వాతనే కేసు విచారణ కీలక మలుపు తీసుకునే అవకాశముంది. రోడ్లపై ఉన్న సీసీ టీవీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. తెలిసిన వారే వీరిని సోమవారం రాత్రి హత్యచేసి తెచ్చి మూసీ నదిలో పడవేసి ఉంటారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి పోలీసుల విచారణలో వాస్తవాలు బయట పడాలి.