హైదరాబాద్ కీ షాన్‌గా చెప్పుకునే ఎగ్జిబిషన్ అది. ఏటా జనవరి నెలలో హైదరాబాద్‌లోని నాంపల్లిలో నిర్వహించే ‘నుమాయిష్’ ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వస్తు ప్రదర్శనగా గుర్తింపు పొందింది. గుండు పిన్నుల నుంచి అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాల వరకు అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లభించే వస్తువులన్నీ అక్కడ కొలువుదీరుతాయి. దేశ విదేశాల నుంచి వ్యాపారులు వచ్చి స్టాళ్లు ఏర్పాటు చేసుకుంటారు. అలాంటి ప్రతిష్టాత్మక ఎగ్జిబిషన్ ప్రతిష్ట ఒక్కసారిగా మసకబారింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం (జనవరి 30) రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం పెను నష్టాన్ని మిగిల్చింది.
రాత్రి 8 గంటల సమయంలో చిన్నగా మొదలైన మంటలు అంతకంతకూ విస్తరించాయి. స్టాళ్లు పక్కపక్కనే ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం వార్త తెలియగానే నిర్వాహకులు పెద్ద ఎత్తున అరుస్తూ.. జనాన్ని అప్రమత్తం చేశారు. దీంతో పర్యాటకులు పరుగు అందుకున్నారు. దీంతో తొక్కిసలాట జరిగి పలువురు గాయపడ్డారు. ఇంత పెద్ద సంఖ్యలో జనం వచ్చినా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 350 పైగా స్టాళ్లు మంటల్లో కాలిబూడిదైనట్లు తెలుస్తోంది. రూ. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఆంధ్రా బ్యాంక్ స్టాల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అయితే.. గ్యాస్ సిలిండర్ పేలుడు వల్లే ప్రమాదం జరిగిందని కొంత మంది ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఓ స్టాల్ వద్ద ఏర్పాటు చేసిన మస్కిటో కాయిల్ గ్యాస్ సిలిండర్‌పై పడటంతో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయని మరో వ్యక్తి చెప్పాడు. ఎలక్ట్రిక్ బల్బు రిపేర్ చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయని మరొకరు తెలిపారు. ప్రమాదానికి సరైన కారణాలేమిటో తెలియాల్సి ఉంది.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
దేశం నలుమూలల నుంచి వచ్చిన పలువురు వ్యాపారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నాలుగు రాళ్లు వెనకేసుకుందామని వస్తే.. అగ్ని ప్రమాదం తీరని నష్టాన్ని మిగిల్చిందని మీడియా ముందు కంటతడి పెడుతున్నారు. కోట్లాది రూపాలయ సంపద కాలి బూడిదైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన 10 నిమిషాల లోపే ఫైర్ ఇంజన్లు వచ్చి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేదికాదని వ్యాపారులు చెబుతున్నారు. ఎగ్జిబిషన్ మైదానంలో అందుబాటులో ఉంచిన ఫైర్ ఇంజన్లలో నేళ్లే లేవని వారు ఆరోపిస్తున్నారు. పొట్ట చేతపట్టుకొని వచ్చి పిల్లలతో సహా వీధిన పడ్డామని రోదిస్తున్నారు. ఎగ్జిబిషన్ ముగుస్తున్న దశలో సంభవించిన ప్రమాదం తమను నిండా ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో హోం మంత్రి మహమూద్ అలీ, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ ప్రమాద స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.