తెలంగాణ రాష్ట్రం లోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయా రెడ్డి సజీవ దహనం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని షాక్ కు గురి చేసింది. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయా రెడ్డిని ఆమె కార్యాలయంలో, ఆమె చాంబర్లో తలుపులు వేసి, పెట్రోలు పోసి కాల్చి చంపేశాడు. ఆమె మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో మాట్లాడే నెపంతో వచ్చి ఈ దౌర్జన్యానికి ఒడిగట్టాడు. కౌలు రైతుకు, భూ యజమానికి మధ్య తలెత్తిన వివాదంలో ఆమె బలైపోయారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే తహసీల్దార్ కాలి బూడిద అయ్యారు. ఈ ఘటనను తెలంగాణ సీఎం కెసిఆర్ ఖండించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితుడు సురేష్ పై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఐపీసీ 302, 307, 333 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ హత్యకు సంబంధించి కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి.

భూవివాదంపై నిందితుడు సురేష్ హైకోర్టును ఆశ్రయించాడు. పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం తహసీల్దార్‌పై వత్తిడి తెచ్చాడని.. అయితే విజయారెడ్డి తనకు అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంతో హత్య చేసినట్లు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 1990 నుంచి ఈ భూములపై వివాదాలున్నాయి.! 2004 తర్వాత భూములపై కొందరు రాజకీయ నేతల కళ్లు పడ్డాయని సమాచారం. ఈ వివాదస్పదమైన భూముల వ్యవహారంలో తల దూర్చిన కొందరు పెద్దలు.. మరోవైపు భూములు కొన్న పెద్దలు తమకు అనుకూలంగా రికార్డులు మార్చాలని అధికారులపై ఒత్తిళ్లు చేసినట్లు తెలుస్తోంది. 120 ఎకరాల వివాదంపై హైకోర్టులో కేసులున్నాయి. కౌలుదారుల చేతిలో 77 ఎకరాలు, పట్టాదారుల ఆధీనంలో 42 ఎకరాలు ఉన్నట్లు సమాచారం. కాగా వివాదాస్పద భూముల వ్యవహారంలో మంత్రి పేరు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకు చెందిన రాజకీయ నేతలు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ మంత్రి ఎవరు..? ఆ నేతలు ఎవరు..? అనేదానిపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
దీని పైన పోలీసులు సురేష్ ఇచ్చిన వాంగ్మూలంతో పాటుగా మొత్తంగా ఆ భూముల వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలు, కొద్ది రోజులుగా తహసీల్దార్ ను కలిసిన వారి వివరాలు కోర్టులో ఉన్న కేసుల పైన పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఇదే సమయంలో విజయారెడ్డి భర్త సైతం కీలక ఆరోపణలు చేసారు. దీని వెనుక పెద్దలు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా పోలీసులు పూర్తి సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం 60 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్యుల సమక్షంలో సురేశ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఎమ్మార్వోను ఎంత బతిమలాడినా తనకు పట్టా ఇవ్వలేదని చెప్పాడు. సోమవారం మధ్యాహ్నం వెళ్లి మరోసారి విజ్ఞప్తి చేశానని, ఆమె స్పందించ కపోవడంతో తిరిగి పెట్రోలు డబ్బాతో కార్యాలయానికి వెళ్లానని చెప్పాడు మొదట తనపై పోసుకొని, తర్వాత ఆమెపై పోశానన్నాడు. తనకు నిప్పంటించుకొని ఆమెను కూడా తగులబెట్టానని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనలో విజయారెడ్డిని రక్షించేందుకు ప్రయత్నించిన డ్రైవర్, అటెండర్ తీవ్ర గాయాలపాలయ్యారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. అక్కడే ఉన్న మరో రైతుకు కూడా కాలిన గాయాలయ్యాయి.
ఈ క్రింద వీడియో చూడండి
The post తహసీల్దార్ హత్య వెనుక తెలంగాణ మంత్రి హస్తం appeared first on Telugu Messenger.