హర్యానాలోని దడౌలీ గ్రామానికి చెందిన వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చావైనా, బతుకైనా కలిసుండటమే జీవితం అనుకున్నారు. అనుకున్న విధంగానే ముందడుగు వేశారు. గర్భిణి అయిన భార్యను డెలివరీ కోసం ఆగ్రోహ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో భర్త చేర్పించాడు.
ఈ నేపధ్యంలో భార్య కోసం ఇంటినుంచి ఆహారం తీసుకువస్తుండగా, అతని ద్విచక్రవాహనాన్ని ఒక ట్రక్కు ఢీకొంది. ఈ నేపధ్యంలో తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇదే సమయంలో భార్య ఒక శిశువుకు జన్మనిచ్చింది. తరువాత ఆమె ఆరోగ్యం క్షీణించింది.
వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. మృతుని తండ్రి జగదీష్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు రేషన్‌లాల్, అతని భార్య అందరినీ ఎదిరించి కలసివుంటున్నారు. మరోవైపు వీరి బంధువర్గమంతా వీరితో బంధాన్ని తెంపేసుకున్నారు. కాగా ఈ దంపతులకు జన్మించిన శిశువు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందున్నాడని వైద్యులు తెలిపారు.