కొన్ని కొన్ని సంఘటనలు నమ్మడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి.. అలాంటిదే ఇది కూడా. ఆయన పేరు నీలకంఠ గౌడ్. పదిరోజుల క్రితం రైలు ప్రమాదంలో చనిపోయాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తెచ్చి దహన సంస్కారాలు చేశారు. ఐదు రోజుల కర్మకాండ కూడా పూర్తయింది. ఇంతలోనే ఆయన గ్రామ సచివాలయం వద్ద ప్రత్యక్షమయ్యాడు. పింఛన్ కోసం క్యూలో నిలబడ్డాడు. దీంతో అక్కడున్నవారు అవాక్కయ్యారు. కర్నూలు జిల్లా డోన్ మండలంలోని గుమ్మకొండలో ఈ నెల 2న ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నీలకంఠ గౌడ్ భిక్షాటనకు వెళుతుంటాడు. నెలలో 25 రోజులు డోన్, నంద్యాల రైల్వేస్టేషన్లలో గడుపుతుంటాడు. ప్రతి నెలా 2, 3 తేదీల్లో గుమ్మకొండకు వచ్చి పింఛన్ తీసుకువెళుతుంటాడు.
నవంబరు 25న నంద్యాల వద్ద రైలు పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది నీలకంఠ గౌడ్‌దేనని కుటుంబ సభ్యులకు కొందరు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన కుమారులు, బంధువులు నంద్యాల రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. రైల్వే సీఐ ప్రకాష్‌రెడ్డిని కలిసి మృతదేహాన్ని చూపించాలని కోరారు. అప్పటికే బాగా కుళ్లిపోయి ఉండటంతో సరిగా గుర్తించలేకపోయారు. ముఖం, కాళ్లను బట్టి నీలకంఠ గౌడ్‌దేనని అనుకుని మృతదేహాన్ని తీసుకువెళ్లారు. అదేరోజు సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.
చనిపోయాడనుకున్న నీలకంఠగౌడ్ ఈ నెల 2వ తేదీన తిరిగొచ్చాడు. నేరుగా గ్రామ సచివాలయం వద్దకు వెళ్లాడు. దీంతో అక్కడున్నవారు షాకయ్యారు. ‘చనిపోలేదా..?’ అని అడిగారు. జరిగిన విషయం ఆయనకు వివరించారు. అది తాను కాదని చెప్పిన గౌడ్, పింఛన్ తీసుకుని ఇంటికి వెళ్లాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయారు. ఇక లేడనుకున్న వ్యక్తి తిరిగిరావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. నీలకంఠ గౌడ్ తిరిగి భిక్షాటనకు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఖననం చేసిన మృతదేహం ఎవరిదో తేలాల్సి ఉంది.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
రైలు ప్రమాదంలో నీలకంఠగౌడ్ చనిపోయాడని కొందరు చెప్పడంతో నంద్యాలకు వెళ్లాం. కుటుంబ సభ్యులతో కలిసి నేనూ మృతదేహాన్ని చూశాను. కుళ్లిపోయి ఉండటంతో సరిగా గుర్తించలేకపోయాం. అక్కడే పొరపాటు జరిగింది. అయినా బతికి రావడం సంతోషంగా ఉంది అని చెబుతున్నారు అక్కడ ప్రజలు. చిన్న తప్పుఎంత పొరపాటు చేసిందో చూశారుగా. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం కామెంట్ ల రూపంలో తెలియచేయండి.