ఇటీవల తల్లిదండ్రులు కొందరు కర్కసంగా తయారు అవుతున్నారు, తాజాగా జరిగిన ఈ సంఘటన అందరిని కన్నీటి పర్యంతం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు వారు. మొదట ఓ బిడ్డ పుట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇంకో బిడ్డ పుట్టాడు. రెండో బిడ్డ పుట్టాక భర్త తనను, రెండో బిడ్డను సరిగా చూసుకోవడం లేదని ఆ ఇల్లాలు తీవ్రంగా కలత చెందింది. తన భర్తకు ఇష్టంలేని ఆ రెండో బిడ్డ తనకూ అవసరం లేదనుకుంది. ఇంట్లో అందరూ బయటకు వెళ్లిన సమయంలో బిడ్డను నీళ్ల డ్రమ్ములో పడేసి ఉసురు తీసింది. ఏమీ ఎరుగనట్లు తన బిడ్డనెవరో చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు విచారణ జరిపి తల్లే అసలు హంతకురాలని తేల్చారు.
ఈ దారుణం ఎస్‌ఆర్‌పురం మండలం పిల్లిగుండ్లపల్లె ఒంటిల్లు(దళితవాడ)లో జరిగింది. పసికందును హతమార్చింది కన్నతల్లేనని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. చివరికి ఆ తల్లిని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ విషయాన్ని పోలీసులు ద్రువీకరించారు. పిల్లిగుండ్లపల్లెకు చెందిన నాగరాజు, రాజమ్మ దంపతుల కుమార్తె భువనేశ్వరి అదే మండలంలోని ఎగువ మెదవాడ దళితవాడకు చెందిన వై.వినోద్‌కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే వీళ్లిద్దరు ఇష్టపడి కలసి వెళ్లిపోవడంతో భువనేశ్వరి కుటుంబీకులు చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వినోద్‌కుమార్‌పై ఫిర్యాదు కూడా చేశారు. కేసు నమోదై వినోద్‌కుమార్ రిమాండ్‌కు సైతం వెళ్లి వచ్చారు. తర్వాత భువనేశ్వరి, వినోద్‌కుమార్‌లు పొదటూరుపేటలో వివాహం చేసుకున్నారు.

వీరికి తొలి సంతానం మగబిడ్డ పుట్టాడు. మొదటి కాన్పుకు భువనేశ్వరి భర్త వినోద్‌కుమార్ అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. తర్వాత భువనేశ్వరికి పుట్టింటితో మళ్లీ అనుబంధం ఏర్పడింది. తిరిగి రెండోసారి గర్భం దాల్చింది. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రెండో కాన్పు జరిగింది. రెండో కాన్పులో కూడా మగబిడ్డ పుట్టాడు. ఆ తర్వాత వినోద్‌కుమార్ రెండో బిడ్డపై అంత ప్రేమ చూపేవాడు కాదు. రెండో బిడ్డ పుట్టాక భర్త తనను, బిడ్డను సరిగా చూసుకోవడం లేదని భువనేశ్వరి తీవ్ర ఆందోళన చెందేది. రెండో బిడ్డ పుట్టడం వల్లే భర్త మారిపోయాడని ఎలాగైనా ఆ బిడ్డని అంతమొందించాలనుకని భువనేశ్వరి నిర్ణయించుకుంది. ఫిబ్రవరి 26న కుటుంబీకులు అంతా పనులకు బయటకు వెళ్లాక భువనేశ్వరే తన రెండవ బిడ్డను ఎత్తుకెళ్లి ఇంటి ఆవరణలోని నీళ్ల డ్రమ్‌లో పడేసి మూత పెట్టి వచ్చేసింది. ఏమీ తెలియనట్టు ఉండిపోయింది.

తన బిడ్డ కనిపించడం లేదని ఏడ్చి చివరికి నీళ్ల డ్రమ్‌లో శవమై కనిపించినట్లు ఇంట్లోవారికి, ఇరుగుపొరుగుకు చెప్పింది. ఎవరో తన బిడ్డను నీటి డ్రమ్ములో పడేసి చంపేశారని ఎస్‌ఆర్‌పురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కార్వేటినగరం సీఐ చల్లనిదొర దర్యాప్తు చేశారు. సీఐ దర్యాప్తులో తల్లే ఈ దురాగతానికి పాల్పడినట్లు తేలింది. ఈనెల 7న ఎస్‌ఆర్‌పురం పోలీస్ స్టేషన్ వద్ద భువనేశ్వరిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచి, రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు.చూశారా ఈ కన్న తల్లి ఎంత కర్కశానికి ఒడిగట్టిందో.