పెద్దలు వద్దన్నా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని నూరేళ్లు సంతోషంగా గడపాలనుకుంది. తాను ఒకటి తలిస్తే విధి మరొకటి తలచినట్లు వారి కాపురంలో మద్యం మహమ్మారి చిచ్చు రేపింది. ప్రేమించిన వాడే మద్యం మత్తులో వేధించిడం ప్రారంభించాడు. ఈలోగా ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. భర్త బాధలు భరించలేక… తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేక.. అల్లానే ఆదుకుంటాడని దర్గా వద్దకు చేరింది. పోషణ భారమై దుబాయికి వెళ్లి తమ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలని కలలు కనింది. చివరికి మహిళా ఏజెంట్ చేతిలో మోసపోయి ఉపాధి కోసమని వెళ్లి వ్యభిచార ఊబిలో చిక్కుకుని చిత్రహింసలకు గురైంది. చివరకు శరీరం సహకరించక ప్రాణమున్న శవంలా తిరిగి దర్గా చెంతకు చేరింది.

ఏఎస్‌పేట మండలం అనుమసముద్రం గ్రామానికి చెందిన షేక్ నవాబు అదే గ్రామానికి చెందిన హబీ బున్నీషా ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు కాదన్నా 2009లో వివాహం చేసుకున్నారు. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగడంతో ఇద్దరు కుమారులు కలిగారు. భర్త నవాబు తాగుడుకు బానిస కావడంతో వేధింపులు మొదలయ్యాయి. అవి భరించలేక తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేక పిల్లలను తీసుకుని పక్కనే ఉన్న ఏఎ్‌సపేట దర్గా వద్దకు చేరింది. దర్గా సమీపంలోని వసీమా అనే మహిళ ఇంట్లో పాచిపని చేసుకుంటూ పిల్లలను పోషించుకునేది. ఈ తరుణంలో ఆర్నెళ్లుగా హాబీ బున్నీషా, పిల్లలు కనపడకుండా మాయమయ్యారు. భార్య పిల్లలు దూరమయ్యాక కళ్లు తెరుచుకున్న భర్త నవాబు.. వారి కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. నెల రోజుల క్రితం ఉలుకూ పలుకూ లేని జీవశ్చవంలా ఉన్న హబీ బున్నీసాను నెలరోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకువచ్చి దర్గా వద్ద వదిలి వెళ్లారు. విషయం తెలుసుకున్న భర్త విచారించగా భార్య శరీరంపై బ్లేడుతో కోసిన కోతలు, సిగరెట్‌తో కాల్చి గాయాలు ఉండటంతో ఏం జరిగిందో తెలియక చికిత్స అందిస్తున్నాడు. భార్యతో పాటు ఉన్న బ్యాగును పరిశీలించగా అందులో మస్కట్ టికెట్, మెడికల్ టెస్ట్‌లు చేసిన రిపోర్టులు ఉండటంతో అనుమానంతో వసీమాను నిలదీశాడు. పిల్లలు పామూరులోని మదరసాలో చదువుకుంటున్నారని తెలిపారు. తన భార్య మస్కట్‌కు వెళ్లి మోసపోయిందని గ్రహించిన భర్త నవాబు మంగళవారం ఏఎ్‌సపేట ఎస్‌ఐ వీరనారాయణకు ఫిర్యాదు చేశాడు.
ఈ క్రింది వీడియో చూడండి
గల్ఫ్ దేశాలకు వెళితే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వసీమా చెప్పిన మాయమాటలు విని హాబీ బున్నీసా మస్కట్ వెళ్లేందుకు నిర్ణయించుకుంది. ఎవరికీ తెలియకుండా తన పిల్లలను వసీమా సహకారంతో ఆమె బావ పనిచేసే పామూరులోని మదరసాలో చేర్పించి మస్కట్‌కు వెళ్లింది. నకిలీ పత్రాలతో పాస్‌పోర్టును తయారుచేసి మస్కట్‌కు తీసుకెళ్లి అక్కడ వ్యభిచారగృహానికి అమ్మేసింది. దీంతో మోసపోయిన హాబీ బున్నీసా దేశం కానీ దేశంలో నానా తంటాలు పడింది.ఉపాధి కల్పిస్తామన్న వసీమా మాయమాటలు నమ్మి వెళ్లి వ్యభిచార ఊబిలో చిక్కున్న హబీ బున్నీసా దేశం కాని దేశంలో చిత్రహింసలకు గురయింది. సిగరెట్లతో కాల్చి, బ్లేడులతో కోసి నానా హింసకు గురి చేశారు. చివరకు అనారోగ్యం పాలై ఏఎస్‌పేట దర్గా వద్దకు చేరింది. నెల రోజులుగా ఆహారం లేకుండా కేవలం పానీయాలు తాగుతూ నెట్టుకొస్తోంది. తన భార్యను మోసం చేసి వ్యభిచార గృహానికి అమ్మేసి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసిన వసీమాపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి భర్త నవాబు వేడుకుంటున్నాడు.

భర్త నవాబు ఫిర్యాదు మేరకు ఆత్మకూరు సీఐ పాపారావు, ఎస్‌ఐ వీరనారాయణ మంగళవారం సాయంత్రం విచారణ చేపట్టారు. ఏఎస్‌పేట దర్గా ఆవరణలో హాబీ బున్నీసాను విచారించారు. ఆమె మాట్లాడలేని స్థితిలో ఉండటంతో నెల్లూరు వైద్యశాలకు తరలిస్తామన్నారు. ఈ సందర్భంగా సీఐ పాపారావు మాట్లాడుతూ షేక్ నవాబును 2008 ప్రేమ వివాహం చేసుకున్న హాబీ బున్నీసాకు భర్తకు దూరమై దర్గా ఉన్న ఉన్న తరుణలో 2018, సెప్టెంబరులో పిల్లలతో సహా కనబడకుండా వెళ్లిపోయినట్లు చెప్పారు. ఆ తర్వాత 2019, మార్చి చివరి వారంలో మాట్లాడలేని స్థితిలో దర్గా వద్ద కనిపించిందని, విచారించగా గ్రామానికి చెందిన ఒక మహిళ, కడప జిల్లా బద్వేల్‌కు చెందిన ఏజెంట్ ఇద్దరూ తన భార్యను మస్కట్‌కు ఉపాధికని పంపి వ్యభిచారంలోకి దింపారని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారన్నారు. కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ చేస్తామన్నారు.