ఈ ఏడాది ఎంత చెప్పుకున్నా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ కురవాల్సిన దానికంటే తక్కువ వర్షపాతం కురిసిందనే చెప్పాలి. మనకు వర్షాల జాడ లేదు కాని దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా వందలాది గ్రామాలు నీట మునిగాయి.. వరణుడి ధాటికి వేలాది ఇళ్లు కూలి పోయాయి. వర్షాలు-వరదల దెబ్బతో దాదాపు 6 వందల మంది మృతి చెందారు. వందలాదిమంది గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రుయులైయ్యారు. అటు వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ బాధితులను ఆదుకోవడాని కి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి..

మహారాష్ట్రపై వరుణుడు మరో సారి తన ప్రతాపం చూపిస్తున్నాడు.. పూణే-థానే-పాల్ఘర్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. కళ్యాణ్ ప్రాంతంలో భారీ వర్షాలకు బ్రిడ్జ్ కూలిపోయింది. పూణేలో వరద నీటిలో వాహనాలు చిక్కుకుపోయాయి. కుండపోత వర్షాలకు ముంబైలో జనజీవనం స్తంభించింది. వర్షాలు, వరదల తో నానా అవస్థలు పడుతున్న ముంబైకర్లను ఈదురుగాలులు హడలెత్తించాయి. బలమైన గాలుల ధాటికి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం ఇంజిన్ దెబ్బ తిన్నది. మరో 24 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ క్రింద వీడియోని చూడండి
గంగా-యమున నదులు ఉగ్రరూపంలో ప్రవహిస్తుండడంతో ఉత్తర భారత రాష్ట్రాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఇప్పటికే గంగమ్మ ధాటికి వందలాది ఇళ్లు మునిగిపోయాయి. గుళ్లూ-గోపురాలు జలమయమయ్యాయి. ప్రమాదకరస్థాయిని దాటి గంగ, యమునలు పరుగులు పెడుతుండడంతో పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.ఉత్తరప్రదేశ్-బిహార్‌లలో పరిస్థితి దారుణంగా ఉంది. రోజుల తరబడి పడుతున్న వర్షాలతో రెండు రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆస్తినష్టం-ప్రాణనష్టం-పంటనష్టం అధికంగా ఉంది. గ్రామాలకు గ్రామాలే నీట మునగడంతో లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. నిలువనీడ కోల్పోయినవారిని షెల్టర్లకు తరలించి ఆశ్రయం కల్పించారు. వర్షాల దెబ్బకు రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైలు మార్గాలు పాడయ్యాయి. రవాణ వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలగడంతో సాధారణ జనజీవనానికి విఘాతం ఏర్పడింది.

బిహార్ ఇంకా వరద ముప్పు నుంచి బయటపడలేదు. నేపాల్ నుంచి పోటెత్తుతున్న వరద, రాష్ట్రంలో దంచికొడుతున్న వరదలతో , పొంగిపొర్లుతోంది కోసీ నది.. వెరసి బిహారీలు వరదముప్పులో చిక్కుకుపోయారు. మధుబని, సమస్తిపూర్ సహా డజన్ జిల్లాలో ఊళ్లకు ఊళ్లే నీట మునిగాయి. రోడ్లుపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజలు తెప్పలు, చిన్న చిన్న పడవల సాయంతో నిత్యావసర పనులు చేసుకుంటున్నారు.ఆగకుండా కురుస్తున్న వర్షాలు కేరళను కుదిపేస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా కేరళలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనజీవనం అస్థవ్యస్తంగా మారింది. నదులు, చెరువులు పోంగి ప్రవహిస్తున్నాయి. దాంతో పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతన్నాయి. గతంలోను వరదలు కేరళను కుదిపేయడంతో ప్రజలు మరింత భయబ్రాంతులకు గురవుతున్నారు, ఇప్పటికే వందల మంది వర్షాల కారణంగా నిరాశ్రయులుగా మారారు.

రాజస్థాన్‌లోనూ వరుణుడు బీభత్సం సృష్టించాడు. చురు సహా పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. భారీగా వర్షం పడడంతో ఇళ్లల్లోకి నీరు చేరింది. రోడ్లపై అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లో వానల జోరు క్రమంగా పెరుగుతోంది. సిమ్లా, కులూ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడుతున్నాయి. విస్తారంగా పడుతున్న వర్షాల తో నీటి వనరులు కళకళలాడుతున్నాయి. వరద నీటితో రోడ్లు దెబ్బతింటున్నాయి.

జమ్మూకశ్మీర్‌లో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో నదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. చీనాబ్ నది మహోగ్రంగా ఉరకలేస్తోంది. డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తుండడంతో నదీ పరివాహక ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తానికి సౌత్ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ తెలంగాణ చెన్నైలో వర్షాలు లేవు కాని దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఈ ప్రాంతాల వారు మాత్రం వర్షాల కోసం పూజలు హోమాలు యాగాలు చేస్తున్నారు. వరుణుడు ఎప్పుడు ఇక్కడ కరుణిస్తాడో చూడాలి.
The post దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఈ రాష్టాలవారికి గండం.. హెచ్చరిస్తున్న అధికారులు appeared first on Telugu Messenger.