ఏపీ తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు పడని పరిస్దితి మరో పక్క ఉత్తర భారతదేశం వరదలతో మునిగిపోతోంది…ఎగువన కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద కొంత తగ్గుముఖం పట్టినా దేవీపట్నం మండలం సముద్రాన్ని తలపిస్తోంది. ఉవ్వెత్తున వచ్చే గోదావరి వరదై పోటెత్తితే ఆ ఉగ్రరూపం తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఎవ్వరూ అంచనా వేయలేరు. 1986, 2006 లో తప్పితే ఎప్పుడూ ముంపు గ్రామాల ప్రజలు భయపడలేదు. ఇళ్లు మునిగినా వరద పోయే వరకు ఎదురుచూశారు. కానీ ఈసారి ఉగ్ర గోదావరి తీవ్ర రూపం దాల్చకముందే వరద నీరు ఊళ్లను ముంచెత్తింది. భద్రాచలం వద్ద మొదటి హెచ్చరిక ఇవ్వకముందే ముంపు గ్రామాలు నీట మునిగాయి. భద్రాచలం వద్ద నీటి మట్టం 40 అడుగులకు చేరకముందే గోదావరి ఊళ్లను చుట్టి ముట్టి సముద్రంలా మారింది. తీవ్రత మరింత పెరిగితే తమ పరిస్థితి ఏంటని ముంపు గ్రామాలు ప్రజలు భయపడుతున్నారు.

ఇంట్లోంచి బయటికి వస్తే కనుచూపు మేర దారి కనిపించడంలేదు. కొందరైతే మునిగిన ఇళ్లను వదిలి కొండలపైకి వెళ్లిపోయారు. ఊళ్లలో ఉన్నవారు ఏంచేయాలో తెలియని స్థితితో దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మూడు రోజులుగా నీటిలోనే నివాసం. చుట్టూ కమ్మేసిన నీరు ఎప్పుడు దిగువకు పారుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు పెరుగుతున్ననీరు వణికిస్తోంది. ఊళ్లను పెకలించిస్తోందేమోనని భయంతో గడుపుతున్నారు. దేవీపట్నం మండలంలోని 32 ముంపు గ్రామాలన్నీ ఇలానే ఉన్నాయి.
ఓ వైపు వరద పోటెత్తుతుంటే మరోవైపు మధ్య మధ్యలో కురుస్తున్న వర్షం వరద బాధితులను మరింత ఇబ్బంది పెడుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 38 అడుగులుగా ఉంది. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 26.3 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ఇన్ ఫ్లో 8 లక్షల 30 వేల క్యూసెక్కుల చేరింది. దీంతో దేవీపట్నం తో పాటు ఆ మండలంలోని కొండమొదలు, కత్తులూరు, దొందూరు, కొయ్యేరు, పేరంటాలపల్లి, వీరవరం లంక, అగ్రహారం, పోచమ్మగండి,పూడి పల్లి, రమణయ్యపేట తదితర గ్రామాలు జలదిగ్ఢందలోనే ఉన్నాయి. తొయ్యేరు గ్రామంలో అయితే రహదారి పైనే 12అడుగుల ఎత్తుకు నీరు చేరుకుంది.

కట్ట కట్టేయడమే గోదావరి ముంచెత్తిందని ముంపు గ్రామాల వాసులు చెబుతున్నారు. అదే పోలవరం ఎగువ కఫర్ డ్యామ్ .. ప్రకృతి విపత్తే అయినప్పటికీ ఊహించి ఉప్పెనే అంటున్నారు. ధవళేశ్వరం వద్ద 36 లక్షలు క్యూసెక్కుల నీటిని వదిలినప్పుడు కూడా వరద ఉధృతికి వణికని ముంపు గ్రామాల ప్రజలు 5 లక్షల ఇన్ ఫ్లో రాగానే బెదిరిపోయారు. ధవళేశ్వరం వద్ద 6 లక్షల ఇన్ ఫ్లో రాగానే కఫర్ డ్యామ్ వద్ద నీటి 27 అడుగులకు చేరింది. గ్రామాలన్నీ రాత్రికిరాత్రి వరద పోటుకు మునిగిపోయాయి. అర్ధరాత్రి ఇళ్లను గోదారి ముంచెత్తుతుంటే దిక్కుతోచని స్థితిలో కట్టు బట్టలతో ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
ఈ క్రింద వీడియో చూడండి
పోలవరం నిర్మాణంలో భాగంగా ఎగువ కాఫర్ డ్యామ్ 35 మీటర్లు ఎత్తు మాత్రమే నిర్మించారు. ఈ ఏడాది జూన్ నాటికి 42 మీటర్లు నిర్మించి స్పిల్ వే నిర్మాణం పూర్తి చేసి వచ్చిన వరదనీటిని స్పిల్ వే మీదుగా మళ్లించాలన్నది ప్రణాళిక కాగా గ్రావిటీ ద్వారా నీళ్లివ్వాలన్నది ప్రణాళికలో భాగమే. కానీ జూన్ నాటికి రెండు నెలలముందే పనులు నిలిచిపోవడంతో స్పిల్ వే గ్రౌంటింగ్ పనులు పూర్తవలేదు. దీంతో నీటి మళ్లింపునకు మార్గం లేకుండా పోయింది. ముంపు గ్రామాలకు ముప్పు తప్పలేదు. ఊహించినట్టుగానే గోదావరి ఉగ్ర రూపం దాల్చకముందే ముంపు గ్రామాల ప్రజలు పెను ముప్పును ఎదుర్కొంటున్నారు. ఇక మరో వారం రోజులు ఇలాంటి వర్షాలు కురిస్తే గోదావరి ఉగ్రరూపం దాలుస్తుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెబుతున్నారు అధికారులు.
The post తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉగ్రరూపం దాల్చిన గోదావరి appeared first on Telugu Messenger.