మారుతిరావు చేసిన పనికి ఇప్పుడు రాష్ట్రంలో అందరూ అతనికి ఉరిశిక్ష పడాలి అని కోరుకుంటున్నారు… మరో పక్క ప్రేమికులు ఆయనని వదలకూడదు అని డిమాండ్ చేస్తున్నారు, అతనికి శిక్ష పడకపోతే, మా తల్లిదండ్రులు ఇలాంటి వ్యక్తిని చూసి మరింత రెచ్చిపోతారు అని చెబుతున్నారు. ఇక తాజాగా ఇలా మారుతిరావు ఎపిసోడ్ జరిగి వారం కాకముందే, పలు ప్రేమ జంటలు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎలాంటి పని చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
సార్…! నా పేరు రెజినా. నేను ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాను. నాతో పాటు బీటెక్ చదువుతున్న శరత్‌ను ప్రేమించాను ఇంటర్ నుంచి శరత్ క్లాస్‌మేట్. ఇద్దరివి వేర్వేరు మతాలు. మా ప్రేమ వ్యవహారం ఇంట్లో పెద్దలకు తెలిసి అంగీకరించడం లేదు. చదువు మాన్పించి మరో పెళ్ళి చేయాలని నిర్ణయించారు. దీంతో ఇంట్లో చెప్పకుండా వచ్చేసి పెళ్ళి చేసుకున్నాం. మిర్యాలగూడలో ప్రణయ్ హత్య నేపథ్యంలో మాకు మరింత భయం ఏర్పడింది. ఎలాగైనా మీరే మాకు రక్షణ కల్పించాలి. ఇది ఓ జంట ఆవేదనసార్.. నా పేరు జోసఫ్. నేను ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. మా ఎదురింటికి చెందిన శ్రావణితో నాలుగేళ్ళుగా పరిచయం ఉంది. ఇరువురం ప్రేమించుకున్నాం. ఇళ్ళల్లో మా పెళ్ళికి అంగీకరించడం లేదు. శ్రావణికి పెళ్ళిచేయాలని సంబంధాలు చూస్తున్నారు. దీంతో ఇద్దరం ఇంటి నుంచి పారిపోయి వచ్చి పెళ్ళి చేసుకున్నాం. మిర్యాలగూడ, హైదరాబాద్‌లలో జరిగిన పరువు హత్యల నేపథ్యంలో భయం వేస్తోంది. మాకు ప్రాణరక్షణ కల్పించండి. ఇది రెండోవ జంట ఆవేదన
ఇలా కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారిలో కొంత భయం ఉండడం సహజమే. అయితే ఇటీవల మిర్యాలగూడలో చోటు చేసుకున్న పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటన మరువక ముందే బుధవారం హైదరాబాద్‌లో ఇదే తరహాలో ఓ జంటపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలతో జిల్లాలోని ప్రేమికుల్లోను భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఇలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుని ఇరు కుటుంబ సభ్యులు హెచ్చరికలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న జంటల్లో ఈ ఘటనలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వీరితో పాటు రోజుల వ్యవదిలో వివాహాలు చేసుకున్న వారు, వివాహాలకు సిద్ధమైన వారు భయంతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గుంటూరు రాజేంద్రనగర్‌లో తమ కుమార్తె వేరే కులానికి చెందిన యువకుడిని వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు నమ్మకంగా ఇంటికి పిలిపించి దారుణంగా హత్య చేయించిన ఘటన కొన్నేళ్ల క్రితం జిల్లా వాసులను ఉలిక్కిపడేలా చేసింది.జీవితంలో స్థిరపడకుండానే అనేక మంది పెళ్ళిళ్ళు చేసుకుని కష్టాల సుడిలోకి అడుగు పెడుతున్నారు. డిగ్రీ, బీటెక్ చదువు మధ్యలో ఉన్న వారు ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. అదేమంటే మా ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిపోయిందని, చదువు మాన్పించి పెళ్ళి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారని అందువల్లే పారిపోయి వచ్చి పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిందని బదులిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలా బతుకుతారంటే ఏదో ఉద్యోగం చేసి పోషించుకుంటానంటూ బదులిస్తున్నారు. ఈ విధంగా కుల, మతాంతర వివాహాలు చేసుకున్న అనేక జంటలు ఆ తరువాత ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు ఉన్నాయి. పిల్లలు పుట్టిన తరువాత కూడా వీరి ముఖం చూడడానికి తల్లిదండ్రులు ఏ మాత్రం ఇష్టపడడం లేదు.
గడిచిన కొన్నేళ్లుగా జిల్లాలో ఎంతో మంది యువతీయువకులు, కుల, మతాంతర ప్రేమ వివాహాలు చేసుకున్నారు. అయితే కొన్ని జంటల విషయంలో అనేక ఉద్రిక్తతలు, కిడ్నాప్‌లు, బెదిరింపులు వంటి ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇంట్లో నుంచి పారిపోయిన తరువాత వారు పెళ్ళి చేసుకుని పోలీసు కార్యాలయాన్ని ఆశ్రయిస్తారని ఊహించిన అనేక మంది యువతుల తల్లిదండ్రులు, బంధువులు పోలీసు కార్యాలయం దగ్గర కాపు కాసిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో ఆయా జంటలు పోలీసు కార్యాలయానికి వచ్చాయని తెలుసుకుని కార్యాలయం లోపల నుంచే బలవంతంగా తీసుకెళ్ళే ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. చంపుతామని బెదిరించిన కొందరు, త్వరలో బంధువులందరినీ పిలిచి ఘనంగా పెళ్ళి చేస్తామని నమ్మించి తీసుకెళ్ళిన ఘటనలు కూడా ఉన్నాయి.కొందరు పెళ్ళి చేసుకోకుండానే పోలీసు కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు. తమకు పెళ్ళి చేయాలని కోరుతున్నారు. తాము పెళ్ళి చేయబోమని, ఇరువురు మేజర్లు అయి ఉండి పెళ్ళి చేసుకుని వస్తే రక్షణ కల్పిస్తామని పోలీసులు సూచిస్తున్నారు. ప్రేమ వివాహాల వల్ల భవిష్యత్తు పరిణామాలపై వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయితే ఆయా జంటలు వారి మాటలు వినే పరిస్థితిలో ఉండడం లేదు. తాము ఇంట్లో నుంచి పారిపోయి వచ్చామని, మా వారి కంట పడితే చంపేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా జంటల్లో కొందరు మైనర్లు కూడా ఉంటుండడం ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది