అమీర్‌పేట మెట్రో రైలు స్టేషన్‌లో పెచ్చులూడి పడి మృతి చెందిన మౌనిక కుటుంబానికి మెట్రో అధికారులు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మౌనిక కుటుంబానికి రూ.20 లక్షల నగదు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈ మేరకు మౌనిక కుటుంబ సభ్యులతో ఎల్ అండ్ టీ సిబ్బంది సోమవారం (సెప్టెంబర్ 23) మధ్యాహ్నం చర్చలు జరిపారు.అమీర్‌పేట మెట్రో స్టేషన్ దుర్ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ మౌనిక కుటంబు సభ్యులు గాంధీ ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. రూ.50 లక్షలు ఇవ్వాలని ఎల్ అండ్ టీని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఎల్ అండ్ టీ ప్రతినిధులు.. మౌనిక కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. అనంతరం మౌనిక మృతదేహానికి గాంధీ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.

అమీర్‌పేట స్టేషన్‌లో మెట్రో పిల్లర్‌కు చేసిన సిమెంట్ ప్లాస్టరింగ్ పెచ్చు ఊడి.. 30 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా మీద పడటంతో మౌనిక దుర్మరణం పాలైంది. ఆమె తలకు బలమైన గాయం కావడంతో మృతిచెందింది. వాన కురుస్తుండటంతో మెట్రో స్టేషన్ కింద కాసేపు తలదాచుకుందామని భావించిన మౌనికను మెట్రో పిల్లర్ రూపంలో మృత్యువు కబళించింది.కేపీహెచ్‌బీ కాలనీలో నివసించే హరికాంత్ రెడ్డి భార్య మౌనిక (26) ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కేపీహెచ్‌బీలో మెట్రో ఎక్కి అమీర్‌పేట స్టేషన్‌లో దిగింది. వర్షం పడుతుండటంతో స్టేషన్ మెట్ల మార్గం (ఎ1053 పిల్లర్) కింద కాసేపు నిల్చుంది. అంతలోనే పిల్లర్ పెచ్చులు ఊడి మౌనిక తలపై పడ్డాయి. దీంతో తల పగిలి తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ క్రింద వీడియో చూడండి
మౌనిక స్వగ్రామం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గోపరపల్లి. ఆమె భర్త హరికాంత్.. మంచిర్యాల పట్టణ సమీపంలోని శ్రీరామ్‌పూర్. ఈ దంపతులకు ఏడాది కిందటే పెళ్లయింది. నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న హరికాంత్ రెడ్డి.. కేపీహెచ్‌బీ కాలనీ ఎస్.ఆర్.హోమ్స్‌లో నివసిస్తున్నాడు.పెచ్చు చిన్నదే అయినా బాగా ఎత్తు నుంచి తలపై పడటంతో మౌనిక మృతి చెందిందని ఎల్‌అండ్‌టీ, మెట్రో అధికారులు తెలిపారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని పేర్కొన్నారు
The post మెట్రో విషాదం.. మౌనిక కుటుంబానికి రూ.20 లక్షలు, జాబ్ appeared first on Telugu Messenger.