నిన్న కాచిగూడలో రెండు రైళ్లు ఎదురెదుగా వచ్చి గుద్దుకున్న ఘటన మరవకముందే మరొక ఘోర రైలు ప్రమాదం జరిగింది.. నిన్న ఏ ఒక్కరి ప్రాణాలు కూడా పోలేదు కానీ ఇప్పుడు జరిగిన రైలు ప్రమాదంలో ఏకంగా 15 మంది చనిపోయారు. పూర్తీ వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో 16 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ప్రయాణికుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. బంగ్లాదేశ్ లోని బ్రహ్మన్ బరియా జిల్లాలోని కస్బాలో నవంబర్ 12 మంగళవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. సిల్హెట్ నుంచి ఢాకా బయలుదేరిన ఉదయన్ ఎక్స్ ప్రెస్, ఢాకా నుంచి ఛట్టోగ్రామ్ వైపునకు బయలుదేరిన టుర్నా నిషిత ఎక్స్ ప్రెస్ లు ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో మండోబాగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి.

ఈ ఘటనలో రెండు ఎక్స్ ప్రెస్ రైళ్ల ఇంజిన్లు ధ్వంసం అయ్యాయి. ఇంజిన్ సహా తొలి రెండు బోగీలు దారుణంగా దెబ్బతిన్నాయి. వాటిల్లో ప్రయాణిస్తున్న వారిలో 11 మంది సంఘటనాస్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. గాయపడిన వారిని బ్రహ్మన్ బరియా జనరల్ ఆసుపత్రి, కుమిల్లా సదర్ ఆసుపత్రులకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించినట్లు అఖౌరా రైల్వే పోలీస్ స్టేషన్ అధికారిక శ్యామల్ కాంతి దాస్ తెలిపారు. ఈ ఘటనలో సుమారు 12కు పైగా బోగీలు పట్టాలు తప్పాయి. పట్టాలు తప్పిన బోగీలు పక్కనే ఉన్న గుడిసెలపై పడటంతో అవి నేలమట్టం అయ్యాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉండడంతో వారిలో చాలా మంది బోగీల్లోనే చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే బంగ్లాదేశ్ రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లను దారి మళ్లించారు. కొన్నింటిని రద్దు చేశారు. సుమారు కిలోమీటర్ దూరం వరకు పట్టాలు ధ్వంసం అయ్యాయని అధికారులు వెల్లడించారు.
ఈ క్రింద వీడియో చూడండి
ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు రావటానికి సిగ్నల్ వ్యవస్థలో ఉన్న లోపమా లేక సిబ్బంది నిర్లక్ష్యమా అనే విషయం తెలియాల్సి ఉంది. సాంకేతిక లోపాలే ఈ ఘటనకు దారి తీసి ఉంటాయని ప్రాథమికంగా నిర్దారించారు. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపైనా అధికారులు దర్యాప్తు చేస్తున్నామని రైల్వే మంత్రిత్వ శాఖ సమాచార అధికారి షరిఫుల్ ఆలమ్ వెల్లడించారు. లోపల చిక్కుకున్న ప్రయాణికులను రక్షించడానికి రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన రైలు బోగీలను రైల్వే సిబ్బంది తొలగిస్తున్నారు.
The post బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది దుర్మరణం appeared first on Telugu Messenger.