వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఆయనపై శ్రీనివాస్ అనే వెయిటర్ దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్ జగన్‌పై దుండగుడు దాడి చేశాడు. కోడి పందెలకు ఉపయోగించే కత్తితో అతను దాడికి తెగబడ్డాడు. దీంతో వైఎస్ జగన్ భుజానికి తీవ్రగాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ క్యాంటీన్‌లో పనిచేస్తున్న వెయిటర్ శ్రీనివాస్‌గా గుర్తించారు. దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఏపీ పోలీసులు స్పందించారు. వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితంగా వెళ్లి మరీ దుండగుడు శ్రీనివాస్ దాడి చేశాడని, పథకం ప్రకారమే ఈ దాడి జరిగినట్టు కనిపిస్తోందని డీజీపి ఆర్‌పీ ఠాకూర్ ప్రకటించారు. దాడికి పాల్పడిన శ్రీనివాస్ జేబులో ఒక లెటర్‌ను (ఎనిమిది పేజీల లేఖ) కూడా కనుగొన్నామని చెప్పారు. దీన్ని సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది తమకు అందించారని తెలిపారు. ఈ దాడికి సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిదే పూర్తి బాధ్యత అని డీజీపీ పేర్కొన్నారు.
సీఐఎస్‌ఎఫ్ రిపోర్టు ఆధారంగా ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. నిందితుడి ఎడమ చేతిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పబ్లిసిటీ కోసమే చేశాడా, లేక ఈ దాడి వెనుక ఎవరన్నా ఉన్నారనేది విచారిస్తామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు అందిస్తామని డీజీపీ చెప్పారు. మరోవైపు ఎయిర్‌పోర్టులోకి కత్తితో నిందితుడు ఎలా ప్రవేశించాడనేది విచారిస్తున్నామని తెలిపారు. అలాగే దాడికి గురైన ప్రతిపక్షనేత జగన్ హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు దాదాపు 24 గంటల రెస్ట్ అవసరం అని అన్నారు డాక్టర్లు.
మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో ఇదంతా కేంద్రం చేస్తున్న కుట్ర అని అంటున్నారు తెలుగుదేశం నేతలు. ఈరోజు జరిగిన సంఘటనతో వైసీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఎక్కడికక్కడ జగన్ పై దాడికి కారణం అయిన వారిని శిక్షించాలి అని కోరుతున్నారు…తనపై జరిగిన దాడి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని, తాను క్షేమంగా ఉన్నానని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. భగవంతుని దయ, కోట్లాది మంది ప్రజల ప్రేమ, ఆశీస్సులే తనను రక్షించాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇలాంటి పిరికిపంద చర్యలు తన ఆత్మవిశ్వాసాన్ని, లక్ష్యాన్ని దెబ్బతీయలేవని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమం కోసం తాను చేస్తున్న పోరాటాన్ని ఇలాంటి చర్యలతో ఆపలేరని వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలన్న తన సంకల్పం మరింత బలపడుతుందని స్పష్టం చేశారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి.