తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో…వింత చోటుచేసుకుంది. 27 రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ రైతు….పొలానికి వెళ్తుండగా ఓ పాము కనిపించింది. పొలంలో పాములు మామూలే కదా అని అతను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. తిరిగి వస్తుండగా అదే ప్రాంతంలో పాము పడగ విప్పి ఉండడాన్ని గమనించాడు. పగ పట్టిందేమోననే భయంతో వేరే మార్గంలో ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం కూడా పాము అక్కడే ఉండడం చూసి ఊరి ప్రజలకు విషయం చెప్పాడు. దీంతో పాము అనారోగ్యం కారణంగా కదల్లేకపోతుందేమోనన్న భావించి మరో ప్రదేశంలో వదిలిపెట్టారు. అయితే తెల్లవారేసరికి అదే ప్రదేశంలో ఆ పాము మళ్లీ కనిపించింది. ఈ వింతను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.
పక్కనే ఉన్నా పాము కాటు వేయకపోవడం ఎన్ని రోజులైనా అక్కడి నుంచి కదలకపోవడంతో నాగదేవత రూపంలో సాక్షాత్తూ సుబ్రహ్మణ్యస్వామి గ్రామం కోసం ఇక్కడ వెలిశాడని భావించి పసుపురాసి, పాలు పోసి పూజలు చెయ్యడం మొదలుపెట్టారు. ఆ పాముకు ఏకంగా గుడి కట్టడానికి కూడా సిద్ధపడ్డారు గ్రామస్తులు. ఈ వార్త ఆ నోటా ఈనోటా పడటంతో చుట్టుపక్కల గ్రామాలతో పాటు పట్టణాలకు కూడా విషయం పాకింది. దీంతో ఈ వింతను చూసేందుకు తండోపతండాలుగా భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు.సంతానం లేని దంపతులు, పెళ్లికాని యువకులు అక్కడికి చేరుకుని పసుపు కుంకుమ రాసి పాలు పోసి పూజలు చేస్తున్నారు. గ్రామం చుట్టుపక్కల శివాలయాలు ఎక్కువగా ఉన్న కారణంగా ఈ వింత చోటు చేసుకుందని దేవుడు కాబట్టే పట్టుకున్నా కాటు వేయడం లేదని అందుకే దైవంగా విశ్వసించి గుడి కట్టడానికి నిశ్చయించుకున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.నాగేంద్రునికి ఆలయం కట్టేందుకు స్థలం ఇవ్వడానికి ఓ రైతు ముందుకు రావడంతో తాత్కాలిక పందిళ్లు వేసి పూజలు చేస్తున్నారు. వచ్చే శ్రావణ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే జంతు సంరక్షకులు మాత్రం వారి నిర్ణయాన్నిసమర్ధించడం లేదు.. పాము అనేది ఈ ప్రకృతిలోని ప్రాణుల్లో ఒకటి.. సాక్షాత్తు దైవ స్వరూపంగా పామును భావిస్తారు. అందులో తప్పులేదు.. ఎవరి నమ్మకాలు వారివి. కానీ అశాస్త్రీయమైన మూఢనమ్మకాలతో వాటిని ఇబ్బందిపాలు చెయ్యకూడదని సూచిస్తున్నారు. సృష్టిలో ప్రతి ప్రాణికి ఓ ధర్మం ఉంటుందని, అందులో పాము కూడా ఒకటని చెబుతున్నారు. మానవులకు ఎలా అయితే జీవించే స్వేచ్ఛ ఉంటుందో.. పాములు కూడా అలాగే జీవించాలని కోరుకుంటాయని మనుషులు లేని ప్రాంతాల్లో తిరిగే వాటిని గుళ్ళు గోపురాల పేరుతో జనాలమధ్యకు తీసుకువచ్చి పూజలు చెయ్యడం వలన వాటికున్న స్వేచ్ఛ దూరమవుతుందని జంతు ప్రేమికులు వాదిస్తున్నారు. పైగా భక్తితో పాములకు పాలు పోయడంలో తప్పులేకున్నా పాములు పాలు తాగడం వల్ల అజీర్తితో వారం, పది రోజుల పాటు ఇబ్బంది పడి ప్రాణాలు వదిలే ప్రమాదం ఉందని జంతు సంరక్షులు అంటున్నారు.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు. ఈ త్రాచుపాము పొలంలోకి రావడం సుబ్రహ్మణ్య స్వామి అని పూజలు చెయ్యడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.