కొందరిని చూస్తే వారు స్నేహితులా లేదా లవర్సా లేదా పర్సనల్ గా సీక్రెట్ రిలేషన్ లో ఉన్నారా అనే అనుమానాలు కలుగుతాయి.. అలాంటి వారిని చూసి మరికొందరు కూడా సమాజం అంతా ఇలానే ఉంది భ్రమలో ఉంటారు ..వాస్తవాలు తెలుసుకోకుండానే ఇలా తప్పుగా ఉద్దేశించుకుంటారు.. ఇలాంటి ఓ వ్యక్తికి మరి నిపుణులు ఎలాంటి సమాధానం ఇచ్చారో ఈ వీడియోలో తెలుసుకుందాం.
నా వయసు 29 ఏళ్లు. ఎంబీఏ చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. మా అమ్మానాన్నలు నా ప్రమేయం లేకుండానే మూడేళ్లుగా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఏ కోశానా లేదు. ఎందుకంటే ఒకరితో ప్రేమ, మరొకరితో పెళ్లి… ఎటు చూసినా ఇదే తంతు. శారీరక సంబంధాలకే చాలా మంది ప్రేమ అనే పేరు పెడుతున్నారు. ఇదంతా నాకు జుగుప్సాకరంగా ఉంటోంది. పెళ్లి అంటే భయమే కాదు, అసహ్యంగా కూడా కలుగుతోంది. ఈ కారణంగా పెళ్లి గురించి ఆలోచించే స్థితిలో లేను. అయితే నా తలిదండ్రుల నుంచి రోజురోజుకూ నా మీద ఒత్తిడి పెరుగుతోంది. పెద్దవారైన వారిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అలాగని పెళ్లి చేసుకోవాలనీ లేదు. ఆ బంధంలో పడటం కన్నా జీవితమంతా ఒంటరిగా ఉండిపోవడమే మేలనిపిస్తోంది. ఏదో తెలియని ఒత్తిడి పీడిస్తోంది. ఈ స్థితి నుంచి నేను ఎలా బయటపడాలో చెప్పండి అని కోరాడు, అయితే దీనికి నిపుణులు ఇచ్చిన సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నింటికన్నా ముందు ‘‘మానవ సంబంధాలన్నీ శారీరక సంబంధాలు అనుకోకండి.. లోకం పోకడ ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. యువతీ యువకుల మధ్య ఏర్పడే కాస్తంత సాన్నిహిత్యాన్ని కూడా ప్రేమగా ముద్ర వేయడం అలవాటైపోయింది. ప్రపంచం ఒక ఇల్లుగా మారిన ఈ దశలో, వృత్తి పరమైన విషయాల గురించి చర్చలు పురుషులకూ పురుషులకూ మధ్యనే కాకుండా, స్త్రీ-పురుషుల మధ్య కూడా అనేకం జరుగుతాయి. దాన్ని అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాన్ని కూడా పూర్తిగా తోసివేయలేం. కాకపోతే అవి చాలా అరుదుగా చోటుచేసుకునే పరిణామాలు. మీరేమో భూతద్దంలో చూస్తున్నారు. కొంత మంది యువతీయువకుల మధ్య చనువు కొంత ఎక్కువే కావచ్చు. కెరీర్, అచీవ్‌మెంట్‌కు సంబంధించిన భయాలు, వృత్తిపరంగా ఎదురయ్యే తీవ్రమైన పోటీ భయాలు ఈ తరంలో ఎక్కువ.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ఆ విషయాల్లో ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవాల్సిన వివరాలు ఎన్నో ఉంటాయి. వీటితో పాటు పురుషుల మనస్తత్వాల్ని తెలుసుకునే ప్రయత్నంలో స్త్రీలు… స్త్రీల మనస్తత్వాల్ని తెలుసుకునే ప్రయత్నంలో పురుషులు అన్ని రకాల విషయాలనూ లోతుగానే చర్చిస్తున్నారు. అవి అవతలి వ్యక్తికి వాళ్లేదో తప్పు దారి పడుతున్నారని అనిపించవచ్చు. కానీ, వాటిల్లో వాస్తవాల రేటు చాలా తక్కువ. మీరు ప్రస్తావించిన విషయాలను చూస్తే పెళ్లి, దాని తర్వాత వచ్చి పడే బాధ్యతల గురించిన భయాలు చాలానే ఉన్నాయనిపిస్తోంది. ఆ భయాలను కప్పి పుచ్చుకోవడానికి మీలోని అంతశ్చేతన ఇలాంటి అపోహలను అల్లుకుంటున్నదేమో ఆత్మ పరిశీలన చేసుకోండి. నిజానికి, ఏ రకమైన దృష్టితో చూస్తే లోకం ఆ రకంగానే కనిపిస్తుంది. అందువల్ల సమాజం పట్ల మనకున్న దృష్టికీ దృక్కోణానికీ మనమే ఆహుతైపోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. మీకు బాగా నచ్చిన అమ్మాయినే ఎంచుకుని పెళ్లి చేసుకుంటే మీరు, మీ తలిదండ్రులూ ఆనందంగా ఉంటారు.