మరో పెను తుఫాను ఉత్తరాంధ్ర, ఒరిస్సా వైపు వేగంగా వస్తోంది. హకా అని పేరు పెట్టిన ఈ తుఫాను గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా ప్రభుత్వాలు మరింతగా అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం ఈ తుఫాను ఈ ప్రాంతాల వైపు శరవేగంగా దూసుకొస్తోంది. ఉత్తర అండమాన్‌లో మొదలైన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి అండమాన్ వద్ద తీరం దాటింది. ఆ తర్వాత బంగాళాఖాతంలోకి ప్రవేశించిన ఈ తుఫాను విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 1000 కిలోమీటర్ల దూరంలోనూ, ఒడిషాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. తమిళనాడు, పుదచ్చేరి, దక్షిణ, ఉత్తర కోస్తాలలో దీని ప్రభావం అధికంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది.

ఇది మరింత బలపడి పెనుతుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాను 26వ తేదీ మధ్యాహ్నానికి విశాఖపట్నం- గోపాల్ పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. బుధ వారం నుంచి ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. దీంతో అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్, ఒడిషా ప్రభుత్వం స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, లోతట్టు ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అటు.. దక్షిణాంధ్రను ఆనుకుని 3.6 కి.మీ ఎత్తున ద్రోణి ఏర్పడింది. ఇది రానున్న రెండ్రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా తెలంగాణ మీదుగా ప్రయాణించే సూచనలు కన్పిస్తున్నాయి. అటు రుతుపవనాలు బలంగా ఉన్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో బుధవారం అతి భారీ వర్షాలు గురువారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో శుక్రవారం భారీ వర్షాలు కొనసాగనున్నాయి.
ఈ క్రింద వీడియో చూడండి
హకా తుఫాన్ ఏకంగా నాలుగు రోజుల పాటు కొనసాగుతుండటం వల్ల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ప్రభావం చూపుతుందని అధికారులు తెలిపారు. తుఫాను నేపథ్యంలో సహాయక చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని మండలాల్లోనూ ప్రత్యేక అధికారులను నియమించడంతోపాటు ప్రజలను అప్రమత్తం చేశారు. 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపకశాఖకు చెందిన 34 సహాయ దళాలు సిద్ధంగా ఉంచినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహిణ సంస్థ తెలిపింది. చెట్లు కూలితే వెంటనే తొలగించేందుకు 116 బృందాలను సిద్ధం చేశారు. అవసరమైతే మందులు, ఆహారం, రబ్బరు బోట్లు, టెంట్లు, నౌకలు, ఇతర సామాగ్రిని అందించడానికి వీలుగా విశాఖలో ఐఎన్ఎస్ డేగాను సిద్ధం చేసినట్లు తూర్పు నావికాదళం ప్రకటించింది. అమరావతిలోని ఆర్టీజీఎస్ తుఫాను, ఇతర చర్యలను నిఘా కెమెరాల ద్వారా గమనిస్తూ అధికార యంత్రాంగానికి పలు సూచనలు చేస్తోంది.

ఇప్పటికే వాతావరణం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వైరల్ జ్వరాలు, డెంగీ విజృంభిస్తోందని రానున్న రోజుల్లో వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో నీటిని నిల్వ చేసుకోవద్దని, దోమలు రాకుండా దోమ తెరలు వాడాలని సూచిస్తున్నారు. తీర ప్రాంతాల్లో గాలులు వీస్తాయని ప్రజలు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. కాబట్టి అందరు అప్రమత్తంగా ఉండండి. మరి వాతావరణ శాఖా ఇస్తున్న వాతావరణ సూచనా మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.
The post పెను తుఫానుగా ‘హకా’.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు appeared first on Telugu Messenger.